President Message

తెలుగు భాష మరియు తెలంగాణ అభిమానులందరికి అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యములో హౌస్టన్ మహానగరంలో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభలకు మా హృదయపూర్వక ఆహ్వానం.

నిన్ను గూర్చి పాడుకొందు !

నన్ను గూర్చి పాడుకొందు !!

నిన్ను నన్ను కన్న తల్లి!

నేల గూర్చి పాడుకొందు!!

అని విన్నవించిన మన మహాకవి, జ్ఞానపీఠ్ పతాక గ్రహీత, డా. సి. నారాయణ రెడ్డి గారికి ఈ మహాసభలను అంకితం ఇస్తున్నాము

మన రాష్ట్రం మన పాలన మన వనరులు మన అభివృద్ధి అన్న నినాదముతో ఎంతో మంది పోరాటాలు, త్యాగాలు మరియు ఆత్మ బలిదానాలు చేశారు. విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా వివిధ వర్ణాలవారి పోరాటాల ఫలితమే ఈనాటి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం; ఈ మహా యజ్ఞములో ప్రపంచం నలుమూలలా విస్తరించిన తెలంగాణ బిడ్డలు సైతం ఉడతా భక్తిగా ఉద్యమానికి ఊపిరి పోసిండ్రు. రాష్ట్ర సాధనకు అపూర్వ సహాయ సహకారాలను అందించిండ్రు . ఎందరో త్యాధానులు ... ఆత్మ బలిదానాల కారణంగానే ఈ మన తెలంగాణ రాష్ట్రము సాధించుకొని అమరజ్యోతులై వెలిగిండ్రు.

మరి మన తెలంగాణ కోటి రతనాల వీణగా మార్చుకోవాలి! తెలంగాణ సర్వాంగీణ వికాసం జరగాలి. ప్రవాస తెలంగాణ వాసుల నరనరాల్లో ఇదే ఆలోచన...దాని ఫలితమే ఆటా-తెలంగాణా .... అలా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి, మన సంస్కృతి -సంప్రదాయాలు, భాష-యాస, ఆచారం, కట్టుబాట్లు , నడవడికల పరిరక్షణ ధ్యేయంగా, ప్రమంచములోని పలు తెలంగాణ సంఘాల సమ్మేళనంగా శనివారం, మార్చి 18, 2016 వాషింగ్టన్ డీసీ, USA లో ఒక మహా శక్తి కి బీజం పడింది అదే అమెరికా తెలంగాణ సంఘం .

ఉత్తర అమెరికాలో నివసించే ప్రవాస తెలంగాణ సోదరుల సంక్షేమమే లక్ష్యంగా...అమెరికా అంతటా విస్తరించిన దాదాపు 40 తెలంగాణ సంఘాల్ని ఒక్కతాటి మీదకు తేవడమే ధ్యేయంగా, తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రవాసీ తెలంగాణ వాసులకి ఒక వారధిగా అమెరికన్ తెలంగాణ సంఘం (ఆటా-తెలంగాణ) ఆవిర్భావం.. ఆటా తెలంగాణ అంటే ప్రపంచములోని తెలంగాణ సంస్థల ఐక్య సమైక్య వేదిక . సుమారుగా 250 మంది మహామహుల మేధోమధనంతో...వందల మంది ప్రవాసీ తెలంగాణ వాసుల ఆకాంక్షలతో..ఎంతో మంది ప్రవాసీ పారిశ్రామిక వేత్తల ఆశిస్సులతో అమెరికన్ తెలంగాణ సంఘము ఆవిర్భవించింది.

ఈ సద్భావ సంఘానికి సేవలందించే అందుకు అధ్యక్షునిగా ఎన్నుకొని, నాపైన ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన కార్యవర్గానికి, ధర్మకర్తల మండలికి, సభ్యులకు, ఆత్మీయ మిత్రులకు, శ్రేయోభిలాషులందరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.

నేను అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ప్రధానంగా మూడు లక్ష్యాలపైనా దృష్టి సారించడం జరిగింది.

1 ) ప్రపంచ మహాసభల ద్వారా మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, సదాచారాలనూ, భాష సాహిత్యాలను, బావి తరాలకు బోధిస్తూ వాటిని పరిరక్షించే ప్రయత్నం

2) మన మాతృ భూమి మన సేవా అన్న నినాదంతో ప్రవాసీ తెలంగాణ ప్రజలు వారి మాతృభూమికి ఋణం తీర్చుకునే సదుపాయాలు కల్పించడం

౩) తెలంగాణనుండి వచ్చే విద్యార్థులకు మరియు ఉద్యోగులకు తగిన సలహాలు ఇస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుడమేకాక, వారు నిలదొక్కుకునే విధంగా సహకరించాలి మరియు కష్టాలలో ఉన్న మన వారికీ సహాయ సహకారాలు అందించడము

.

ఈ దృష్టితో అమెరికా తెలంగాణ సంఘము తన సేవలందించటానికి ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్క సారి జరుపుకునే ప్రపంచ తెలంగాణ మహాసభలు-2018, ఈసారి జూన్ 29,30, జూలై 1, 2018 మూడు రోజుల పాటు హ్యూస్టన్, టెక్సాస్ లోని, జార్జ్ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నాం.

ఈ మహాసభలలో ... తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవాలి..దశాబ్దాల అణచివేతకు గురైన తెలంగాణను సగర్వంగా తలెత్తుకునేలా ఎలా చేయాలి..? సతత హరిత, బంగారు తెలంగాణగా ఎలా తీర్చిదిద్దాలి?? వేలాది మంది తెలంగాణ ప్రవాసుల్ని ఒక్క వేదిక మీదకు తీసుకవచ్చి వారి సలహాలను సూచనలు పాటిస్తూ ముందుకు నడుస్తోంది. ఈ మహాఅద్భుతాన్ని కనులారా వీక్షించడానికి ఇక్కడకు వచ్చిన ప్రపంచంలోని తెలంగాణ బంధువులకు మరియు తెలుగు అభిమానులందరికి ఇదే నా హృదయపూర్వక అభినందనలు. వివిధ ప్రచార ప్రసార సాధనలలో వింటూ, చూస్తూ, చదువుతూ ఉన్నవారికి సలహాలిస్తూ మార్గదర్శనం చేస్తున్నవారందరికి అభివందనం.

**"రైతే రాజు" అనే నినాదంతో రైతు యొక్క ప్రాముఖ్యతను ప్రపంచమంతా తెలియచేసే విధంగా "రచ్చ బండ" కార్యక్రమంలో రైతులను, వ్యవసాయ నిపుణులు మరియు శాస్త్రవేత్తలతో చర్చలు నిర్వహిస్తున్నాము. ఇష్టా గోష్ఠిలో అభిప్రాయాలూ పంచుకుంటారు.

**ఈ సభలలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశాము. వివిధ వైద్య సహాయలందే ఏర్పాటు ఉంటుంది.

**యువత రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వికాసంలో యువశక్తి తదితర అంశాలతో చర్చగొస్టూలు జరుగుతాయి.

**భాషా సాహిత్యాల పరంగా కార్యక్రమాలు జరుగుతాయి. అష్టావధానంతో పాటు, సాహిత్య సదస్సులు నిర్వహించబడతాయి.

** మహాసభల ప్రత్యేకముగా భద్రాచలం నుండి పూజారులు వచ్చి అక్కడి ఉత్సవ విగ్రహాలు, మరియు ప్రసాదముతో శ్రీ సీతారామ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపి భక్తులకు స్వామివారి ఆశిషులందచేస్తారు.

**ఇంకా ఎన్నో బహుళ ప్రయోజనాలు ఈ సభలద్వారా మనం సాధించుకోగలుకుతాము.పెళ్లి సంబంధం చర్చలు , వ్యాపారం-నెట్వర్కింగ్, నిరంతర వైద్య విద్య (CME), షాపింగ్ ప్రదర్శనలు

** ఇక సంగీత, సాహిత్య, నృత్య, జానపద, నాటకాది విశేష కార్యక్రమాలతో సందేశాత్మకంగా, ప్రయోజనాత్మకంగా ఈ మహాసభలకు అట్టహాసంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నాము.

తెలంగాణ నేల తల్లినీ... చెమట చుక్కలని - పూల పండుగలని - కొలువైన ఇలవేలుపులని - కళాకారులని - కోలాటం - చిందు బాగోతాలతో పాటుగా సమస్త కళా రూపాలని.. పాటల స్వరూపాలని - పండుగలని - వేర్వేరు మతాల భిన్నత్వాలలో తెలంగాణ ఏకత్వాన్ని - యాసని - భాషని - త్యాగాలని - త్యాగధనులనీ - మహనీయులనీ - నదుల సింగారాలు- పాతబస్తీ సోయగాలని - శాతవాహన - సమ్మక్క సారక్కల - కాకతీయుల నుండి ఐలమ్మల వరకు మలి దశ ఉద్యమం వరకు పోరాటాల ధిక్కార స్వరాలని... పోరాటాల స్వరూపాలని... తెలంగాణ పడిన కష్టాలని.. పునర్నిర్మాణంలో ఇప్పుడు జరుగుతున్న వికేంద్రీకరణనీ... నృత్య - గాన - చిత్ర సమ్మేళనమైన ప్రదర్శనతో ఒక సారి తెలంగాణ మట్టి వాసన ఎట్ల ఉంటదో కళ్లకు కట్టినట్టుగా ఈ ప్రపంచ తెలంగాణ మహాసభలలో ప్రదర్శించడమే మాయొక్క ఈ ప్రయత్నం.

అవును... మన తెలంగాణ సమాజాన్ని మరోసారి ఏకీకృతం చేసే బృహత్ కార్యక్రమానికి ఆటా-తెలంగాణ శ్రీకారం చుట్టింది. మాతృభూమి బంగారు తెలంగాణగా..హరిత తెలంగాణగా మారే క్షణం కోసం పరితపిస్తూ ప్రపంచ నలుమూలలలో విస్తరించిన ప్రవాస తెలంగాణ సోదర సోదరీమణులు మరోసారి ఈ వేదికగా కలుసుకోగలగటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి.. ఈ అనితర సాధ్యమైన బృహత్ లక్ష్యాన్ని ఆటా ధర్మకర్తలు, కార్యవర్గం మరియు కార్యకర్తల సమష్టి కృషితో...తెలంగాణ ప్రవాస మిత్రుల అండదండలతో, ఎన్నారై పారిశ్రామికవేత్తల ఆర్ధిక, హార్దిక వెన్నుదన్నుతో... ఘనంగా, వైభవంగా నిర్వహినుంచబోతున్నాము. మీరంతా ఈ మహాసభలలో పాల్గొని మా ఆతిధ్యాన్ని స్వీకరించి, విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

జై తెలంగాణ...జై జై తెలంగాణ. జై అమెరికా తెలంగాణ సంఘం ... జై హింద్....

మీ,
సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల,
అధ్యక్షులు

 

 

 

 

 

 

 

 

 

 

Sponsors

Photo Gallery

© 2018 American Telangana Association. All rights reserved.
Design & Developed by ArjunWeb